ద‌ర్శ‌కనిర్మాత రామ్ గోపాల్ వ‌ర్మ లాక్ డౌన్ స‌మ‌యంలో కూడా త‌ను ఏదోలా వార్త‌ల్లో ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. ఇప్ప‌టికే లాక్ డౌన్ లోనే ఒక సినిమాను రూపొందించి, విడుద‌ల కూడా చేసేసిన ఆర్జీవీ అలాంటి మ‌రో సినిమాను రెడీ చేసిన‌ట్టుగా ఉన్నారు. ఆ సంగ‌త‌లా ఉంటే, ఫాద‌ర్స్ డే ప్ర‌త్యేకంగా రామ్ గోపాల్ వ‌ర్మ ఒకింత సంచ‌ల‌న ప్రాజెక్టును ప్ర‌క‌టించాడు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన అమృత భ‌ర్త హ‌త్య‌-ఆమె తండ్రి మారుతీరావు ఆత్మ‌హ‌త్య ఈ కాన్సెప్ట్ మీద ఆర్జీవీ సినిమాను ప్ర‌క‌టించాడు. ఆ మేర‌కు ఫ‌స్ట్ కూడా విడుద‌ల చేశారు.

ఈ ప‌రువు హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా నిలిచింది. ప్ర‌త్యేకించి ఆ హ‌త్య సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో దేశం మొత్తం ఆ ప‌రువు హ‌త్య ప‌ట్ల విస్మ‌యం వ్యక్తం చేసింది. కూతురు వివాహం చేసుకున్న అబ్బాయిని ఆమె తండ్రే హ‌త్య చేయించ‌డానికి సుపారీ ఇచ్చాడ‌నే అభియోగాలు సంచ‌ల‌నం రేపాయి. ఆ హ‌త్య కేసులో మారుతీరావు నిందితుడి జైలుపాల‌య్యారు. బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన కొన్ని నెల‌ల‌కు అనూహ్యంగా ఆయ‌న కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించారు. అలా వ‌ర‌స విస్మ‌య‌క‌ర ఘ‌ట‌న‌ల‌తో ఆ వ్య‌వ‌హారం వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలుస్తూ వ‌చ్చింది.

వివాదాస్ప‌ద అంశాల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ క‌న్ను ఎప్పుడూ ఉంటుంది. ఏ వివాదం జ‌రిగినా దానిపై సినిమా అంటూ ఆర్జీవీ హ‌డావుడి చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో సైలెంట్ తాజా సినిమా ప్ర‌క‌ట‌న చేశారు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఈ వ్య‌వ‌హారం సినిమా అంత తేలిక కాదేమో. కులాల ప్ర‌స్తావ‌న‌తో కూడుకున్న ప‌రువు హ‌త్య- కోటీశ్వ‌రుడి ఆత్మ‌హ‌త్య‌. అలాగే ఈ సినిమా ప్ర‌తిపాద‌న ప‌ట్ల అమృత ఎలా స్పందిస్తుందో అనేది కూడా కీల‌క‌మైన అంశ‌మే. రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం సంకోచాలేమీ లేకుండా అమృత‌-మారుతీరావుల క‌థే అని తేల్చి చెబుతున్నారు. సినిమా పేరు మ‌ర్డ‌ర్, క్యాప్ష‌న్ కుటుంబ‌క‌థా చిత్రం!