ఇక నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ముఖ్యమైన సమాచారం, పత్రాలను షేర్ చేయడం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం తన అధికారులకు తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కొత్తగా కమ్యూనికేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లను అస్సలు ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ ఆదేశించింది. ఇందుకు గల కారణాలను కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ సోషల్ మీడియా యాప్‌ల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని, అందుకే దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాధనాల ద్వారా మాత్రమే కనెక్ట్ కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ తెలిపింది.