కరోనా వైరస్‌ను లేబొరేటరీలో సృష్టించినట్లు అపవాదు ఎదుర్కొంటున్న చైనా కేసులు విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించడం లేదు. వైరస్ అడ్డా అయిన వుహాన్‌లో కేసులను భారీగా తగ్గించి చూపి ఇప్పటికే విమర్శలు పాలైన డ్రాగన్ గురించి ఓ అంతర్జాతీయ నివేదిక దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. చైనా ప్రభుత్వం చెబుతున్నట్లు దేశంలో కరోనా కేసులు 82 వేలుకాదని, ఆరున్నర లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయని అమెరికా నుంచి వెలువడే ‘ఫారిన్‌ పాలసీ’ పత్రిక తెలిపింది. చైనాలో వందలాది నగరాల నుంచి, ఓ రహస్య డేటా నుంచి సేకరించిన సమాచారం ప్రకారం తాము ఈ నిర్ధారణకు వచ్చినట్లే తెలిపింది.

పత్రిక ప్రచురించిన నివేదికలోని వివరాల ప్రకారం.. చైనాకు చెందిన టెక్నాలజీ యూనివర్సిటీ నివేదికలో కేసులు అసలు వివరాలు ఉన్నాయి. చైనాలో 230 నగరాల్లో వేలాది స్కూళ్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రుల్లో నమోదైన కేసులను పరిశీలించారు. చైనా సైన్యానికి చెందిన టెక్నాలజీ యూనివర్సిటీ తయారు చేసిన నివేదిక ఆధారంగా తాము ఈ లెక్కలు వేశామని ఫారిన్ పాలసీ తెలపింది. అయితే పేషంట్ల వివరాలు, ఇతర సమాచారం మాత్రం అందులో లేదు.

కాగా, వుహాన్ నగరంలో 2579 మంది చనిపోయారని తెలిపిన చైనా తర్వాత ఈ లెక్కలను సవరించింది. అక్కడ మరో 1,290 మంది కరోనా చనిపోయాయని, మొత్తం మృతుల సంఖ్య 3,869కి చేరిందని వెల్లడించింది. కొంతమంది రోగులు ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్లలోనే చికిత్స తీసుకోవడం, సమాచారం లోపాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఇదివరకు కేసులను తక్కువగా చూపామని అని వివరించింది.