కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించిన నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకులు స్పందించాయి. ఇప్పటికే మారటోరియం అందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ప్రకటించగా, తాజాగా ప్రైవేటు బ్యాంకులు సైతం ముందుకొచ్చాయి.

మారటోరియం కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాలని పేర్కొన్నాయి. మారటోరియం వద్దనుకునేవాళ్లు బ్యాంకుకు తెలియజేయాలనే (ఆప్ట్‌-ఔట్‌) ఐచ్ఛికాన్ని పీఎస్‌బీలు అందించగా, కావాలనుకునేవాళ్లు బ్యాంకులను సంప్రదించాలనే (ఆప్ట్‌-ఇన్‌) ఐచ్ఛికాన్ని ఇచ్చాయి. మారటోరియం అవసరం లేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారమిస్తున్నాయి.