దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి ఉదంతంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ: హైదరాబాద్‌లో యువతి హత్యపై యావత్‌ దేశం ఆందోళన, బాధను వ్యక్తంచేస్తోందన్నారు. ఈ వ్యవహారంలో దోషులను ఉరి తీయాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు.

పోలీసులు వారిని అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు.

దేశంలో రెండోసారి మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నేరాలపై కఠిన చట్టం తీసుకొచ్చామనీ ఇలాంటి కిరాతకులకు తొందరిగా ఉరిశిక్షలు పడేలా చట్టంలో మార్పులు చేసినట్టు గుర్తుచేశారు. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్‌ రెడ్డి కోరారు. ఈ కేసులో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ సహాయం అందించొద్దని న్యాయవాదులను కేంద్రమంత్రి కోరారు.