ఏదైనా హోటల్ ముందు వాహనాలు నిలిపితే, ఆ వాహనం చోరీకి గురైతే హోటల్ యాజమాన్యానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హోటల్ ముందుగానీ, హోటల్ పార్కింగ్ లాట్ లో గానీ కారుగానీ, టూవీలర్ గానీ వాహనం ఏదైనా నిలిపి పార్కింగ్ స్లిప్ తీసుకుంటే, ఒకవేళ ఆ వాహనం చోరీకి గురైతే, దాని బాధ్యత తప్పనిసరిగా హోటల్ యాజమాన్యానిదే అని పేర్కొంది. పార్కింగ్ లాట్ లో పెట్టిన వాహనానికి హోటల్ యాజమాన్యం పార్కింగ్ లాట్ స్లిప్ ఇస్తే, వాహనం తమ కస్టడీలోనే వుంటుందని వినియోగదారుడికి హామీ ఇచ్చినట్లేనని స్పష్టం చేసింది.

హోటళ్ళకు వచ్చిన కస్టమర్ల వాహనాలకు ఆ వాహనాలదే బాధ్యతని, తమకేమీ సంబంధం లేదంటూ ఓనర్స్ రిస్క్ అన్న బోర్డు పెడితే అది చట్ట విరుద్దమని పార్కింగ్ స్లిప్ ఇచ్చినప్పుడు యాజమాన్యం బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది. వాహనం తాళాలు హోటల్ వాలెట్ దగ్గర ఇచ్చినప్పుడే బాధ్యత హోటల్ యాజమాన్యానికే బదలాయింపు అయినట్లేనని పేర్కొంది. ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో పార్కింగ్ ప్లాట్ లో పెట్టిన కారు చోరికి గురికావడంతో యజమాని హోటల్ పై కేసు వేశాడు. ఈ కేసులో చివరకు సుప్రీంకోర్టు అప్పీల్ లో కీలకమైన తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు హోటల్ లోనే కాకుండా డబ్బులు తీసుకుని పార్కింగ్ స్లిప్పులు ఇచ్చే మాల్స్, సినిమా హాళ్ళు, ఇతరత్రా దుకాణాలకు కూడా అన్వయిస్తుందని స్పష్టం చేసింది. పార్కింగ్ ఉచితంగా కల్పిస్తున్నారా ? లేక డబ్బులు తీసుకుంటున్నారా ? అనేది అప్రస్తుతమని హోటల్ కస్టమర్లు మాల్స్, క్లబ్ ఇటువంటి వాణిజ్య సముదాయాల్లో కస్టమర్ల వాహనాలకు ఆ యా సంస్థలదే బాధ్యతని తీర్పు ఇచ్చింది. వాలెట్ పార్కింగ్ స్లిప్పులు ఇచ్చిన తర్వాత ఓనర్స్ రిస్క్ అనే పదానికి అర్ధం లేదని కోర్టు పేర్కొంది. అలా కాకుండా భూకంపాలో, ఇతరత్రా ప్రకృతి వైపరిత్యాల కారణంగానో కార్లు, టూవీలర్లు ధ్వంసమైనా, పోలీసులు లేదా ఫైనాన్షియర్లు ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నా, ఆ విధంగా జరిగే నష్టాన్ని హోటల్స్, మాల్స్ బాధ్యత వుండదని కూడా సుప్రీం స్పష్టం చేసింది.