విగ్గుపెట్టుకుని అందంగా ముస్తాబవుతాడు.. ఫేస్‌బుక్‌లో యువతులకు వల విసురుతాడు. పరిచయమైన యువతుల ఫొటోలు మార్చి బెదిరిస్తాడు. డబ్బు, బంగారం దోచేస్తాడు. అలా చేసి చివరికి కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్‌ డివిజన్‌ పోలీసులకు చిక్కాడు. డీఎస్పీ సుధాకర్‌ నిందితుడి వివరాలను గురువారం వెల్లడించారు. కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన రాజ్‌కుమార్‌ పలు మారుపేర్లు పెట్టుకున్నాడు.

ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా రాజుపాళెంలో ప్రైవేటు పాఠశాల నడుపుతున్నాడు. ఆ బడిలో ఉపాధ్యాయురాలిని కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని ఒక గ్రామానికి తీసుకెళ్లి, నిర్బంధించి హింసించాడు. ఆమె అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు చేశారు. ఈనెల 1న బాధితురాలు తప్పించుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ప్రొద్దుటూరు పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. రాజ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో పలువురిని మోసగించి డబ్బు, బంగారం దండుకుంటున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై వివిధ రాష్ట్రాల్లో 12 కేసులు నమోదయ్యాయి.