ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఇప్పిస్తామంటూ వందలాది మంది నుంచి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ రియల్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ సంఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌లో జరిగింది. విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట శ్రీనగర్‌ కాలనీలో స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రై.లి. పేరుతో రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏడాది క్రితం మాదాపూర్‌లో రెండో శాఖను ప్రారంభించారు. రుణధార, స్వచ్ఛ ట్రేడర్స్‌, స్వధాత్రి ఫైనాన్స్‌ తదితర పేర్లతో విభాగాలను ప్రారంభించి ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు అమ్మితే కమీషన్‌ ఇస్తానంటూ ఏజెంట్లను నియమించుకున్నారు.

ఆయా సంస్థల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిస్తే పెట్టుబడిదారులకు నెలకు రూ.7800 లాభం ఇస్తామని, ఏజెంట్లకు కమీషన్‌ కూడా చెల్లిస్తామని నమ్మబలికాడు. దీంతో ఏజెంట్లు భారీగా సభ్యులను చేర్పించి పెట్టుబడులు పెట్టించారు. సభ్యులకు నెలకు రూ.5 వేలు ఇచ్చి.. తాము రూ.2800 తీసుకునేవారు. గత మూడు నెలలుగా రఘు.. లాభాలు ఇవ్వకపోగా, ఫ్లాట్లు, స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంతో కొందరు పెట్టుబడిదారులు.. మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో కొందరు సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.