విద్యార్ధులకు పాఠాలు చెప్పి వారికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి వక్రబుధ్దితో వ్యవహరించాడు. తన దగ్గర చదువుకునే విద్యార్ధుల తల్లిని కోరిక తీర్చమని బలవంతం చేసి దాడి చేశాడు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికి తిరిగి నిమ్మకాయలు అమ్ముకుని జీవిస్తూ ఉంటుంది. అదే ఊళ్లోని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు కన్ను ఆమెపై పడింది. శనివారం సాయంత్రం ఆమె తన వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు శ్రీనివాస రావు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని వేగంగా ఇంటికి వెళ్లింది. ఆమెను వదిలి పెట్టకుండా, వెంబడించి ఇంటి దాకా వెళ్లాడు శ్రీనివాసరావు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. స్కూల్లో చదువుతున్న నీ పిల్లలకు చక్కగా చదువు చెపుతా లేదంటే వారి భవిష్యత్తు నాశనం చేస్తా నాకోరిక తీర్చు నన్నే వద్దంటావా అంటూ ఆమెని బెదిరిస్తూ గొడవకు దిగాడు. గొడవ ఆపటానికి అడ్డు వచ్చిన ఆమె తల్లితండ్రులను కొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేశారు. ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్ధానిక ఎస్సై ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి బాధితురాలికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.