ఓ మహిళ భర్త ఉండగానే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఇది తెలుసుకున్న భర్త ప్రశ్నించడంతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి కట్టుకున్న భర్తనే గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే: జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరులో కత్తుల సోమిరెడ్డి(39), భవానీ దంపతులు. అయితే భవానీ అదే గ్రామానికి చెందిన కత్తుల సూర్యనారాయణ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

సూర్యనారాయణ రెడ్డి భవానీకి బావ వరుస అవుతాడు. అయితే భార్యపై అనుమానం వచ్చిన సోమిరెడ్డి భవానీని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా, భర్త సోమిరెడ్డిపై కోపంతో భవానీ బుధవారం తెల్లవారగానే వీరి గ్రామానికి సమీపంలోని కొండపోడు వద్ద నివాసం ఉంటున్న కత్తుల సూర్యానారాయణరెడ్డి ఇంటికి వెళ్లింది. భర్త సోమిరెడ్డి సైతం ఆమె వెనకాలే అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ముగ్గురుమధ్య తీవ్రఘర్షణ చోటుచేసుకుంది. భవానీ, సూర్యానారాయణరెడ్డి కలిసి సోమిరెడ్డి గొంతు నులిమి కర్రతో కొట్టి చంపేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో గోతిలో పడేశారు.

ఉదయం తనకేం తెలియనట్టుగా భవానీ ఇంటికి తిరిగివచ్చింది. తన భర్త కన్పించడం లేదంటూ గ్రామస్తులకు చెప్పింది. గ్రామస్తులందరూ చుట్టుపక్కల వెతికగా, గ్రామానికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు వాడిని పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోగా, అప్పటికే నిందితులు పరారయ్యారు.