వేలేరుపాడు: పాతరెడ్డిగూడెంలో నాలుగు నెలల గర్భిణి సోడే రాధ హత్య కేసులో భర్తను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించి ఈ హత్య చేసినట్లు భర్త, నిందితుడు సోడే వెంకటేశ్వరావు పోలీసుల ఎదుట అంగీకరించాడు వివరాలు: పాతరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సోడే రాధను పదేళ్ల క్రితం వెంకటేశ్వర్లు వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మద్యం అలవాటు ఉన్న వెంకటేశ్వర్లు గతంలో తన తండ్రి పైనే దాడి చేసి చెయ్యి విరగొట్టాడు. ఇదిలా ఉండగా, కుక్కునూరు మండలం గుడంబోరులో ఒక గిరిజన యువతితో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో గత నెల 31వ తేదీ రాత్రి పదిగంటలకు ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భర్త వెంకటేశ్వరావు అనుకుని ఆమె తలపై రోకలిబండతో బలంగా రెండు సార్లు కొట్టి పరారయ్యాడు. స్థానికులకు విషయం తెలిసి రక్తపుమడుగులో ఉన్న ఆమెను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. పరిస్ధితి విషమించడంతో ఈ నెల ఒకటో తేదీ ఉదయం రాధ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్వర్లును వసంతవాడ వంతెన వద్ద బుధవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. విలేకరుల సమావేశంలో వేలేరుపాడు ఎస్సై శ్రీనివాసరావు, హెచ్‌సీలు డానియోల్‌, రాజేష్‌ పాల్గొన్నారు.