కర్నూలు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. మహానందిలోని ఈశ్వర్‌నగర్‌ కాలనీకి చెందిన సంగటి రామును ఈ నెల 4న ముగ్గురు యువకులు కొట్టి, చొక్కాతో గొంతు బిగించి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు: సంగటి రాము భార్య మధురేణుక మహానందికి చెందిన బాబా ఫకృద్దీన్‌ అలియాస్‌ బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్లుగా భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి మధురేణుక నంద్యాలలోని బొమ్మలసత్రంలో నివాసం ఉంటోంది.

వివాహేతర సంబంధానికి భర్త రాము అడ్డొస్తున్నాడని చంపించాలని పథకం రూపొందించారు. దీంతో బాబా ఫకృద్ధీన్, గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్ల వేణు, మహానందికి చెందిన ప్రేమ్‌కుమార్‌లు కలిసి రామును మద్యం సీసాలతో కొట్టి చొక్కాతో గొంతు బిగించి హతమార్చారు. మృతుడి తల్లి సంగటి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశినాయన ఆశ్రమం వద్ద సంచరిస్తున్న ముగ్గురితో పాటు మధురేణుకలను అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు.