తిరుపతి అలిపిరి బస్టాండ్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. కరోనా పరీక్షల కోసం వచ్చిన ఓ యువకుడు స్పృహ తప్పి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరోనా పరీక్షల కోసం వచ్చి కిందపడిపోవడంతో, అతడి దగ్గరకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. అలిపిరి సంజీవని కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రం ఈ ఘటన జరిగింది. అయితే కిందపడిపోయిన ఈ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చలనం లేని కుమారుడి వద్ద అతడి తండ్రి రోదనలు అక్కడున్న వాళ్లందరినీ కలిచివేశాయి.

తిరుపతి సమీపంలో ఓ గ్రామం నుంచి తండ్రీకొడుకులు కరోనా పరీక్షల కోసం వచ్చినట్టు తెలుస్తోంది. క్యూ లైన్‌లో నిలబడి మరికాసేపట్లో తన వంతు వస్తుందనేలోపే ఆ యువకుడు స్పృహ కోల్పోయి చనిపోయాడు. అయితే అతడు కరోనా కారణంగా చనిపోయాడా లేక ఇతర కారణాల వల్ల చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది. బాధితుడి మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. అక్కడే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకవేళ బాధితుడికి కరోనా ఉన్నట్టు తేలితే… మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియులు నిర్వహిస్తారు.