పరకాల‌: కొడుకు కుటుంబంతో కొన్నాళ్లు గడుపుదామని అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం రాత్రి 9గంటల (అమెరికాలో తెల్లవారుజామున 4గంటలు)కు జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) హన్మకొండ గోపాలపూర్‌లో నివాసముంటూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌. మిచిగాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు పవన్‌కుమార్‌ వద్దకు రాజమౌళి తన భార్య తో కలసి మార్చి 5న వెళ్లాడు. న్యూయార్క్, వాషింగ్టన్‌లను కారులో కొడుకుతో వెళ్లి సందర్శించారు. ఈ క్రమంలో, ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై నివాసానికి రెండు మైళ్ల దూరం లో ఉండగా వర్షానికి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.

ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో కారులోని నలుగురూ సురక్షిత మని భావించి పవన్‌కుమార్, డ్రైవింగ్‌ చేస్తున్న ఆయన మిత్రుడు కారు దిగి పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమను కాపాడేందుకు పవన్‌ ప్రయత్నించాడు. తల్లి ప్రాణాలతో బయటపడగా, తండ్రి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం సంగతి పరకాలలోని బంధువులకు తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు.