ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల్ని పొట్టనబెట్టుకున్న మోస్ట్‌వాంటెడ్‌ రౌడీషీటర్‌ వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్న విషయాన్ని తెలుసుకున్న యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బుధవారం ఉదయం అతణ్ని పట్టుకోవడానికి వెళ్లగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అమర్‌ దూబేపై రూ. 25 వేల రివార్డు ఉందని తెలిపారు. కాన్పూర్‌లో గత గురువారం వికాస్‌ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పరారీ ఉన్న వారి కోసం పోలీసులు 40 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచారు. వికాస్ దూబే ఇంటిని సైతం కూల్చి వేసిన అధికారులు, అతడి ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు వికాస్ దూబే అనుచరులు ఒక్కొక్కరినే ఏరిపారేస్తున్నారు పోలీసులు.