ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను తాళలేక డెత్‌నోట్‌ రాసి బిడ్డతో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు: మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి– సునంద దంపతుల కుమార్తె బిందు, నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్‌ నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. మొదట్లో దంపతులు అన్యోన్యంగా మెలిగే వారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం మొదలైంది.

భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక సహించలేక బిందు తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా తరచూ ఫోన్లో గొడవపడుతూ ఉండేవారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన బిందు శిశువుకు ఉరి వేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసింది. తన చావుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచు కారణమని పేర్కొంది. నాగమంగల పోలీసులు పరిశీలించి ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.