ఖమ్మం సభకు అనుమతులు ఇచ్చిన పోలీసులు షరతులు విధించడం చర్చనీయాంశమైంది. భారీ బహిరంగ సభపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. షర్మిల టీం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తోన్న వైఎస్ షర్మిలకు తెలంగాణ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అట్టహాసంగా అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కోవిడ్ నిబంధనల కారణంగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బహిరంగ సభకు అనుమతులిచ్చిన పోలీసులు షరతులు విధించడం ఆసక్తికరంగా మారింది. ఖమ్మంలో వచ్చే నెల 9న సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా తెలంగాణలోని అన్నిజిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభకు అనుమతుల కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు.

అయితే పోలీసులు సభకు అనుమతులు మంజూరు చేసినప్పటికీ. కోవిడ్ ప్రభావం కారణంగా ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6 వేల మందితో సభ నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని మెలిక పెట్టారు. సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు. జన సమీకరణపై షర్మిల టీమ్ దృష్టి పెడితే. పోలీసుల రిప్లైతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. సభ నిర్వహణకు సంబంధించి వైఎస్ షర్మిల అన్ని జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.