సబ్ రిజిస్ట్రార్ తస్లీమా శనివారం సెలవు దినం కావడంతో వ్యవసాయ కూలీగా అవతారమెత్తారు. ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు, మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ, తన స్వగ్రామమైన ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో గ్రామానికి చెందిన రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమిలో దినసరి కూలీగా మహిళలతో కలిసి వరి నాట్లు వేసి, ట్రాక్టరుతో పొలం దున్నారు. అనంతరం మధ్యాహ్నం కూలీలతో కలసి పొలం వద్ద భోజనం చేశారు. ఈ సందర్బంగా తన పొలంలో నాటు వేసి, ట్రాక్టర్ తో దున్నినందుకు పొలం యజమాని రాఘవరెడ్డి తస్లిమాకు రోజు వారి కూలీకి చెల్లించే 250 రూపాయలు చెల్లించారు.