{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595345469808","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595345406855","source":"other","origin":"unknown"}
  • అద‌నంగా పెరిగిన 50 బెడ్లు, 15 వెంటిలేట‌ర్లు, 5 బై పాప్ మిష‌న్లు
  • 10వేల ఎన్‌-95 మాస్కులు, 4వేల పిపిఇ కిట్లు
  • మ‌రో 40మంది పారిశుద్ధ్య కార్మికులు, 18 మంది రోగి సంర‌క్ష‌కుల నియామ‌కం
  • అద‌నంగా క్లీనిక‌ల్, మెడిక‌ల్ స్టాఫ్ నియామ‌కం
  • క‌రోనా చికిత్స‌ల‌కై 5 ప్రైవేట్ హాస్పిట‌ల్స్ కి అనుమ‌తుల కోసం సిఫారసులు
  • క‌రోనా వైర‌స్ అదుపు, ఎంజిఎం సామ‌ర్థ్యం పెంపుపై జూలై 15న వ‌రంగ‌ల్ లో మంత్రి ఎర్ర‌బెల్లి నిర్వ‌హించిన స‌మీక్ష ఫ‌లితం
  • తాజాగా మ‌రోసారి టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి ద‌యాక‌ర్ రావు
  • పిఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ లో ఆక్సీజ‌న్ అమ‌ర్చ‌డం, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల కై ఆదేశాలు
  • మ‌రిన్ని ప‌రిక‌రాలు, నియామ‌కాలు, మందులు, సిసి కెమెరాలు, సిబ్బందికి బీమా కోసం అభ్య‌ర్థ‌న‌లు

వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్ కి మ‌రిన్ని హంగులు స‌మ‌కూరాయి. హైద‌రాబాద్ త‌ర్వాత అతి పెద్ద హాస్పిట‌ల్ గా ఉన్న ఎంజిఎం వైద్య‌శాల‌కు మ‌రిన్ని స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చాయి. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో వైర‌స్ ని అదుపు చేయ‌డం, వ‌రంగ‌ల్ ఎంజిఎం సామ‌ర్ధ్యాన్ని మ‌రింత‌గా పెంచ‌డంపై జూలై 15న వ‌రంగ‌ల్ లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశం స‌త్ఫ‌లితాలిచ్చింది. ప్ర‌జాప్ర‌తినిధులు, ఎంజిఎం వైద్యులు, అధికారుల‌తోపాటు, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ప్ర‌తినిధులు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన‌గా, రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తోనూ మంత్రి ఎర్ర‌బెల్లి ఫోన్ లో మాట్లాడారు. ఈ స‌మీక్ష జ‌రిగిన ఐదు రోజుల్లోనే మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ రోజును మంత్రి ఈట‌ల‌కు నివేదించిన 15 అంశాల్లో స‌గానికిపైగా సాధ్య‌మ‌య్యాయి. మిగ‌తా వాటిని సైతం త్వ‌ర‌లోనే స‌మ‌కూర్చ‌నున్నాయి. దీంతో మ‌రోసారి మంగ‌ళ‌వారం సాయంత్రం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి నుంచి అటు హైద‌రాబాద్, ఇటు వ‌రంగ‌ల్ లో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులతో మ‌రోసారి టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ: స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి, ప‌రిష్కారాలు చూపిస్తే, వాటిని సాధించ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నారు. కాపోతే, స‌మ‌న్వ‌యం, సామ‌ర‌స్యం, సానుకూల దృక్ఫ‌థం ఉండాల‌న్నారు. కేవ‌లం 5 రోజుల క్రితం వ‌రంగ‌ల్ లో ఎంజిఎం సామ‌ర్థ్యం పెంపు, క‌రోనా వైర‌స్ ని అరిక‌ట్ట‌డంపై నిర్వ‌హించిన స‌మావేశంలో స‌గానికిపైగా అంశాల‌ను సాధించామ‌న్నారు. క‌రోనా వైర‌స్ అదుపు, ఎంజిఎం సామ‌ర్థ్యం పెంపుపై జూలై 15న వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన స‌మీక్ష ఫ‌లితంగా ఒన‌గూర‌గా, తాజాగా తాము మ‌రోసారి ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిపి టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. వ‌రంగ‌ల్ లోని సెంట్ర‌ల్ జైలు ఆవ‌ర‌ణ‌లో నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్న‌ పిఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ లో ఆక్సీజ‌న్ అమ‌ర్చాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ని కోరామ‌న్నారు. దీంతో మ‌రో 200 ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యం గ‌ల హాస్పిట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని, ఈ హాస్పిట‌ల్ ని పూర్తి క‌రోనా వైద్య‌శాల‌గా మార్చి వైద్యం అందించ‌వ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. అలాగే, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల కై ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. మ‌రిన్ని ప‌రిక‌రాలు అవ‌స‌రం ఉంద‌ని, నియామ‌కాలు జ‌ర‌గాల‌ని, త‌గిన‌న్ని మందులు అందుబాటులో పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. సిసి కెమెరాలు, సిబ్బందికి బీమా కోసం అభ్య‌ర్థ‌న‌లు చేశామ‌న్నారు.