ఎవరైన మనిషి కనిపోతే తెలిసినా తెలియకున్నా అయ్యో పాపం అంటాం. కానీ తమ పార్టీ నేత పెట్టిన అక్రమ బ్యానర్ (ఫ్లెక్సీ) వల్ల చనిపోయిన టెకీ మృతిపై తమిళనాడు అధికార పార్టీ నేత కనీసం ఆపాటి మానవత్వం లేకుండా మాట్లాడారు. చిన్నపాటి సింపతీ లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు.

బ్యానర వల్ల నిండు ప్రాణం బలి:

గత నెల 12న చెన్నైలో శుభ శ్రీ అనే 23 ఏళ్ల యువతి అన్నాడీఎంకే నేత జయగోపాల్ పెట్టిన బ్యానర్ కారణంగా మరణించింది. ఆమె స్కూటీపై వెళ్తుండగా.. రోడ్డు పక్కన అనుమతి లేకుండా కట్టిన బ్యానర్ పైన పడింది. దీంతో శుభ శ్రీ స్కూటీని అదుపు చేయలేక పడిపోయింది.
అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ (లారీ) ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో శుభ శ్రీ ప్రాణాలు కోల్పోయింది. లారీ డ్రైవర్ ను అక్కడే అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో రెండు వారాల తర్వాత జయ గోపాల్ ను కూడా అరెస్టు చేశారు.

గాలి వల్ల ఆమె మృతి:

ఇవాళ చెన్నైలో అధికార పార్టీ నేత పొన్నయన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శుభ్ర శ్రీ మరణం గురించి ప్రశ్నించగా చాలా బాధ్యతారహితంగా మాట్లాడారు. ‘శుభ శ్రీ స్కూటీపై వస్తున్నప్పుడు బ్యానర్ కట్టిన వ్యక్తి అక్కడ ఉండి దాన్ని ఆమెపై తోయలేదు కదా ! కేవలం గాలి వల్లే ఆ బ్యానర్ శుభ్ర శ్రీపై పడింది. మీరెవరైనా ఈ విషయంలో కేసు పెట్టాలనుకుంటే అది గాలిపైనే పెట్టాలి’ అంటూ సింపతీ లేకుండా మాట్లాడారు పొన్నయన్…