టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన‌ పోలీసులు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసులో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్‌ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న కోవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్‌ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది.