తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలు నాగేశ్వరమ్మ (58)ను కడప స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ అర్షద్‌ అడవిలో ఆరు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. వివరాలు ఇలా.. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సమయంలో నందలూరు మండలానికి చెందిన నాగేశ్వరమ్మ కూడా తిరుమలకు బయలుదేరింది. మంగళవారం సాయంత్రం గుర్రపు పాదం వద్దకు రాగానే బీపీ ఎక్కువై సొమ్మసిల్లి పడిపోయింది. ఆ సమయంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అర్షద్‌ వృద్ధురాలిని అడవిలో ఆరు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. విషయం తెలిసి ఎస్పీ అన్బురాజన్‌ కానిస్టేబుల్‌ను అభినందించారు.