వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన కూతురు వైఎస్ షర్మిల ఇందుకోసం హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు షర్మిల పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. సభకు వచ్చిన మాట్లాడిన నేతలంతా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే వైఎస్ షర్మిల నెలకొల్పిన పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. షర్మిల పార్టీలో ముఖ్యనేతగా కొనసాగుతున్న ఇందిరా శోభన్ సైతం ఇదే రకంగా మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఇందిరా శోభన్ తన ప్రసంగం ముగించే సమయంలో మాత్రం అక్కడికి వచ్చిన వారికి ఓ విజ్ఞప్తి చేయడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. తన ఫోన్ పోయిన విషయాన్ని ఆమె సభా వేదిక ద్వారానే అక్కడికి వచ్చిన వారికి తెలియజేశారు. తాను ఎంట్రెన్స్ గేట్ దగ్గర తన ఫోన్ జారవిడుచుకున్నానన్న ఇందిరా అందులో చాలా డేటా ఉందని అన్నారు. ఎవరికైనా తన ఫోన్ దొరికినట్టయితే తీసుకొచ్చి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో అప్పటి వరకు ఆమె ప్రసంగం గురించి మాట్లాడుకున్న వాళ్లంతా ఆమె ఫోన్ పొగొట్టుకుందనే విషయంపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. మరి, షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో ఫోన్ పొగొట్టుకున్న మహిళా నేత ఇందిరా శోభన్‌కు ఆమె ఫోన్ దొరుకుతుందేమో చూడాలి.