తెలంగాణలో పార్టీని స్థాపించి రాజ్యాధికారం చేజిక్కించుకోలని, మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తానని నినదిస్తోన్న వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఊహించని భారీ షాక్ తగిలింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేగాకుండా తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. పార్టీ ఇంకా సరిగ్గా ప్రజల్లోకి రాకముందే, పార్టీలో ఇమడలేక రాజీనామాలు చేస్తుండటంతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ:

‘‘వైఎస్ షర్మిల పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం నన్ను ఆదరిస్తోన్న తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తుపై తదుపరి కార్యచరణ ప్రకటిస్తా’’ అని ఇందిరా శోభన్ తెలిపారు. కాగా, ఇంతకుముందే ఆమె రాజీనామా చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ పెద్దగా ఆమె క్లారిటీ ఇచ్చుకోలేదు. ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చిన తర్వాత ఆమె మళ్లీ కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.