చేయని తప్పుకు తనపై కేసు పెట్టించి జైలుకు పంపించారని మనస్తాపం చెందిన శెట్టి హరికృష్ణ (30) ఆత్మహత్య చేసుకున్నాడు.

హన్మకొండ CI దయాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామానికి చెందిన హరికృష్ణ హన్మకొండ కుమార్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ వాటర్‌ ప్లాంటులో పని చేస్తూ ట్రాలీపై షాపులకు వాటర్‌ క్యాన్లు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో హన్మకొండ బొక్కలగడ్డకు చెందిన ఓ కిరాణ షాపు మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది గమనించిన మహిళ భర్త వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 20 రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చాడు. బొక్కలగడ్డలోని మహిళ ఇంటికెళ్లి మందలించాడు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకుని మనోవేదనకు గురై డిసెంబరు 31న మద్యం సేవించి మత్తులో క్రిమిసంహారక ముందు తాగాడు. స్థానికులు గమనించి ఎంజీఎంకు తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడి అన్న రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.