సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సరిహద్దులో తాజాగా చోటుచేసున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో మరికొన్ని చైనా యాప్‌లపైనా కేంద్రం వేటు వేసింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలపై లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు తమ సమాచారాన్ని అనధికారికంగా సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా చేరవేస్తున్నట్టు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.