రాజశేఖర్ రాజీనామాకు మా ఎగ్జిక్యూటివ్ ఓకే చెప్పేసింది. జనవరి 2న జరిగిన ఘటన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి చేసిన రాజీనామాపై వెంటనే స్పందించింది మా డిసిప్లీనరి కమిటీ. శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో కమిటీ సభ్యులు ఆమోదాన్ని తెలియజేశారు.

మా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు డిసిప్లేనరి కమిటీని ఏర్పాటు చేశారు. డిసిప్లేనరి కమిటీ మెంబర్లుగా కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలను ఎన్నుకున్నారు.

అసలేం జరిగిందంటే

రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు డిసిప్లీనరీ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గురువారం (జనవరి 2, 2020) జరిగిన మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడ్డారు. చిరంజీవి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మాలో చాలా గొడవలు ఉన్నాయని, ప్రొటో కాల్ పాటించడం లేదని రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసోసియేషన్ లో ఉన్న నిప్పును కప్పేస్తే పొగ రాకుండా ఉండదన్నారు. రాజశేఖర్ ప్రసంగాన్ని అడ్డుకోబోయిన మోహన్ బాబుపై ఆయన విమర్శలు చేశారు. అనంతరం రాజశేఖర్ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. రాజశేఖర్ తీరుపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీప్లాన్డ్ గా వచ్చారని..కావాలనే కార్యక్రమాన్ని రసాభస చేశారని…క్రమ శిక్షణ కమిటీ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు క్రమ శిక్షణ కమిటీ రాజశేఖర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మనస్థాపం చెందిన రాజశేఖర్ మా వైఎస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.

మాలో అంతర్గతంగా విభేదాలున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే విభేదాలు తారాస్థాయి చేరి మా డైరీ ఆవిష్కరణ సభలో రచ్చకెక్కాయి. డిసిప్లీనరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయనకు షోకాజ్ నోటీసులు వెళ్లడంతో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు.