గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్‌ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు, అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్‌లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా.? కన్నడలో హీరోయిన్‌గా ‘ఎఫ్‌ఐఆర్’, ‘6 టు 6’ వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ డెంటల్‌ హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు రూట్‌ కెనాల్‌ థెరపీ చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్‌ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది.

ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఆ డెంటిస్ట్‌ తనకు తప్పుడు ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్‌ యాసిడ్‌ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.