హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్దానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సెంటర్ లో హేమలత (23) అనే మహిళ హత్యకు గురైంది. సహోద్యోగి వెంకటేశ్వరరావు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. లాక్ డౌన్ కారణంగా రెండు వారాల పాటు ఇంటికి వెళ్ళి వచ్చిన హేమలత ఇటీవలే మళ్ళీ ఆఫీసుకు వచ్చింది. హేమలత ఫ్యామిలీ కేర్ సెంటర్ లోనే ఉండి అన్నీ చూసుకుంటోంది. అంతకు ముందు ఆమె ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసేది. శనివారం రాత్రి కేర్ సెంటర్ కు అవసరమైన పచారీ సామాన్లు తేవటానికి కేంద్రం యజమాని బయటకు వెళ్ళాడు. ఆసమయంలో కేంద్రంలో హేమలతా, వెంకటేశ్వరరావు అనే మరో ఉద్యోగి మాత్రమే ఉన్నారు. సరుకులు తీసుకుని యజమాని రాత్రి తిరిగి వచ్చే సరికి ఎవరూ కనపడ లేదు.

ఇద్దరు ఉద్యోగులు కనపడకపోయేసరికి ఆయన కేంద్రం మొత్తం వెతకగా హేమలత మృతదేహాం ఒక గదిలో కనుగొన్నాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్దలానికి వచ్చిన పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకు తరలించారు. యజమాని సరుకుల కోసం బయటకు వెళ్లినప్పుడు కేంద్రంలో ఉన్న హేమలతను, సహోద్యోగి వెంకటేశ్వరరావు లైంగికంగా వేధించసాగాడు. ఆమె అతని నుంచి దూరంగా వేరే గదిలోకి వెళ్లి కూర్చుంది. అక్కడకు వచ్చిన వెంకటేశ్వరరావు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించింది. సహాయం కోసం ఆమె గట్టిగా అరవటం మొదలెట్టింది. కేకలు విని ఎవరైనా వస్తారని భయపడిన వెంకటేశ్వరరావు చున్నీ ఆమె మెడకు బిగించాడు. దీంతో ఊపిరాడక హేమలత చనిపోయింది. అక్కడి నుంచి వెంకటేశ్వరరావు తప్పించుకుని పారిపోయాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.