కరోన మహమ్మారిని నియంత్రణ కొరకు విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఇందులో భాగంగా జిల్లా ప్రజలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తమకు కావాల్సిన నిత్యావసర, అత్యవసర వస్తువులను సమకూర్చుకోవాలని సాయంత్రం 6 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వస్తే అనుమతించేది లేదని ఒకవేళ కాదని నిబంధనలకు విరుద్ధంగా బయటకు వస్తే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐపీఎస్ గారు హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ: ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని తమకు కావాల్సిన అత్యవసర మరియు నిత్యవసర వస్తువులను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో అనగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమకూర్చుకోవాలని, వైద్యపరంగా అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్ళుటకు తప్ప మరే ఇతర కారణాల చేత అనవసరంగా బయటకు వస్తే వారి పైన లాక్ డౌన్ కు సంబంధించిన చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐపీఎస్ గారు హెచ్చరించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ లోనూ సర్కిల్ కార్యాలయం నందు డీఎస్పీ కార్యాలయ సిబ్బంది ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కరోనా ను కట్టడి చేయడానికి వాహనాలు తనిఖీ చేస్తూ బీట్లు మరియు పెట్రోలింగ్ చేస్తూ అనుమానం వచ్చిన వ్యక్తుల పైన అలాగే అనవసరంగా బయట తిరుగుతున్న వ్యక్తులను విచారించి సరైన కారణాలు తెలుపని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపినారు.

కరోనా వ్యాధికి మందు లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ కరోన వ్యాప్తి నిర్మూలనకు పాటుపడుతూ పోలీసు వ్యవస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలనీ, మాస్కులు లేకుండా తిరిగే వ్యక్తులపై మున్సిపల్, పోలీస్ అధికారులు కలిసి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి మెదక్ జిల్లాలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వారు ఎవరైనా వస్తే, వచ్చే వారి సమాచారాన్ని గ్రామ పోలీస్ అధికారులు సేకరించి సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తనకు తానుగా స్వీయ నియంత్రణ పాటించి వ్యాధి ప్రబలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి మెదక్ జిల్లాకు వచ్చిన ప్రజలకు హోమ్ క్వారంటైన్ ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు.