విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారాన్ని సోమవారమే అందజేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులు కలిసి బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి పరిహారాన్ని అందజేయాలని చెప్పారు. ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘స్టైరీన్‌ లీకేజీ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలి. ప్రజలెవరూ ఎక్కడా తిరగకుండా, వారికి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా అందజేయాలి.

సాయం కోసం ప్రజలు పదేపదే విన్నవించే పరిస్థితి ఉండకూడదు. బాధితులంతా ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలి. సోమవారం ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా రసాయన అవశేషాలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. సాయంత్రానికంతా ప్రజలు ఇళ్లకు చేరుకునేలా చూడాలి. వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలి. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని డిశ్ఛార్జి అవుతున్నవారు తిరిగి ఇళ్లకు చేరే వరకూ బాధ్యత తీసుకుని, మంచి సదుపాయాలు కల్పించాలి.

ఆ తర్వాత కూడా వారి వైద్యసేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలి. ప్రమాదానికి కారణమైన స్టైరీన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచటానికి వీల్లేదు. వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రాచోట్ల ఉన్న ఈ రసాయనాన్ని వెనక్కి పంపించాలి. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ పని పూర్తి చేయాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.