దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలుత పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడిన వారే ఇప్పుడు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘జై పోలీస్‌! జై జై పోలీస్‌!!’ అంటూ యువ బృందాలు నినదిస్తున్నాయి. మరోవైపు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌పైనా సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడి నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఇప్పుడు దిశ హత్యాచార ఘటనను డీల్‌ చేస్తోంది కూడా ఆయన ఆధ్వర్యంలోనే.. అయితే ఇది యాదృశ్చికమే అయినప్పటికీ ప్రజలు ఆయన్ని పొగకుండా ఉండలేకపోతున్నారు.

‘ఈ ఎన్‌కౌంటర్‌తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారు’ అంటూ ఓ మహిళ స్పందించింది. మరో నెటిజన్‌ స్పందిస్తూ ‘రియల్‌ లైఫ్‌ సింగం’ అంటూ ప్రశంసించారు. పోలీసుల చర్యతో ప్రజలంతా సంతోషిస్తున్నారు అని మరికొంత మంది స్పందిస్తున్నారు. ‘నేరస్థులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీస్‌ అధికారి తెలంగాణలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ మరికొంత మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…