సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట విశాఖ జిల్లాలో ఓ యువతికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. సినిమాలో ఒక పాటకు రూ.10 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అంటూ గీతాలయా స్టూడియో పేరిట సంస్థ నిర్వహకుడు గీతా ప్రసాద్ కొద్దిరోజుల క్రితం పేపర్లో ప్రకటనను ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి 10 మంది యువతులు ఆడిషన్స్​కి వెళ్లారు. లాక్​డౌన్ ఉన్నందున ఎటువంటి అవకాశాలు ఇప్పించకపోవడంతో 9 మంది యువతులు వెనుదిరిగారు. కానీ ఓ యువతికి మాయమాటలు చెప్పి తాను తీస్తున్న చిత్రానికి బడ్జెట్ సరిపోలేదని కొంత డబ్బులు సహాయం చేయమని గీతాప్రసాద్​ కోరాడు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షలను రెండు దఫాలుగా వసూలు చేశాడు.

సినిమా షూటింగ్ జరగకపోవడంతో తన నగదు ఇవ్వాలని యువతి గీతా ప్రసాద్​ను నిలదీసింది. హోటల్​కు వస్తే డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి రప్పించి అప్పటికే అక్కడ మాటువేసుకుని ఉన్న గీతా ప్రసాద్​తో పాటు మరో ఇద్దరు తనను చంపేస్తామని బెదిరించారని బాధితురాలు పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని గ్రహించి వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం అమ్మాయిని పోలీసులు పిలిచి వాస్తవాలను తెలుసుకున్నారు. గీతా ప్రసాద్​తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పశ్చిమ ఏసీపీ స్వరూపారాణి తెలిపారు.