కరీంనగర్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున చేసుకుంటున్న సంబురాల్లో భాగంగా నర్సులు ఆడిపాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్‌లో తీసినట్టుగా ఏర్పడుతుండడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఈ వీడియోపై చర్చలు సాగాయి. సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి పీహెచ్‌సీలో జరిగినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ప్రైవేట్ సాంగ్ ‘బుల్లెట్ బండి’ పాటపై హెల్త్ డిపార్ట్ మెంట్ యంత్రాంగం డ్యాన్స్ చేసిన ఈ వీడియో గురించి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఆగస్టు 15 నాడే స్టాఫ్ నర్స్‌తో పాటు ఇతర ఉద్యోగులు డ్యాన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. స్వతంత్ర దినోత్సవం రోజున అందరం కలిసి ఉన్నప్పుడు ఆడిపాడుకున్నామని సదరు సిబ్బంది చెప్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఆటా పాట ఆరుబయట కాకుండా ఆసుపత్రి కారిడార్‌లో చేపట్టడంతో విమర్శలకు దారి తీసింది.

ఆరోగ్యశాఖ మంత్రి లేకనే:

ఇక, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న బీజేపీ నాయకులు వైద్య ఆరోగ్య మంత్రి లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని కామెంట్స్ చేస్తున్నారు. అజమాయిషీ లేకపోవడం వల్ల వైద్య ఆరోగ్య సిబ్బంది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో జిల్లా యంత్రాంగం కూడా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. వేగవంతంగా విచారణను చేపట్టింది.