టీఆర్ఎస్ పార్టీలో ఊహించని వారికి పెద్ద పెద్ద పదవులు లభిస్తున్నాయి. పదవి ఆశించిన వారికి మాత్రం భంగపాటే ఎదురవుతుంది. ఇది ప్రస్తుతం తెలంగాణ భవన్లో జరుగుతున్న చర్చ. తమను ఎప్పుడు పదవి వరిస్తుందోనని ప్రగతి భవన్ వైపు కళ్లు కాయలు కాసేలా గులాబీ నేతలు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతుందట. తమ పార్టీ అధినేత వైఖరి అర్థం కాక ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50కి పైగా నామినేటెడ్ పదవులను సీఎం కేసీఆర్ భర్తీ చేశారు. వీరిలో చాలా మంది పదవి కాలం ముగిసింది.

ఎన్నికలకు ముందు మూడు కార్పొరేషన్లకు మాత్రమే కేసీఆర్ యేడాది ఎక్స్ టెన్షన్ చేశారు. మిగతా వారి పదవీ కాలం ముగిసినా కూడ గులాబీ బాస్ రెన్యూవల్ చేయలేదు. దీంతో నేతలు కేసీఆర్, కేటీఆర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెన్యూవల్ ఉంటుందని అంతా భావించారు. అయితే ఎన్నికలు ముగిసిన కూడ తమ పదవులపై నేతలకు క్లారిటీ రావడం లేదు. తాజాగా ఆర్టీఐ కమీషనర్లుగా మామూలు నేతలైన శంకర్ నాయక్, మహ్మాద్ అమీర్ లకు కేసీఆర్ పెద్ద పదవులను కట్టబెట్టారు.

దీంతో రెన్యూవల్ పై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఆందోళన మొదలైందట. అయితే సీఎం కేసీఆర్ ఆలోచన వేరేలా ఉన్నట్లు సమాచారం. పాత వారికి కాకుండా కొత్త వారికి పదవులను కేసీఆర్ ఇచ్చే యోచనలో ఉన్నారని, అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలస్యం జరుగుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద తమ బాస్ కేసీఆర్ కు చెప్పుకోలేక, పదవి వస్తుందో ? రాదో ? తెలియక టెన్షన్ గులాబీ నేతల్లో కలవరం మొదలైందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.