ఆమె యువకుడిని ప్రేమించింది. మూడేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. ఇంట్లో పెద్దలకు ఎవరికీ చెప్పకుండా సదరు యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లిని సీక్రెట్ గా ఉంచింది. ఎవరికీ కనీసం తన పెళ్లి విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది. తీరా లాక్ డౌన్ రావడంతో ఇంటికి వచ్చింది. ఆమె ప్రేమ పెళ్లి విషయం తెలియని తల్లిదండ్రులు ఇటీవల ఆమెకు మరో పెళ్లి కుదిర్చారు. విషయం కాస్త ఆమె ప్రియుడికి తెలియడంతో రచ్చరచ్చ చేశాడు. దీంతో సదరు యువతి అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన రంగారెడ్డిలో చోటుచేసుకోగా, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దౌల్తాబాద్ మండలం కుదరుమళ్ల గ్రామానికి చెందిన శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆమె, కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్రవంతి గ్రామానికి వచ్చింది. ఆమెకు రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. కుటుంబీకులు ఈనెల 30న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి గ్రామానికి వెళ్లి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిపాడు.

అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.