కరోనా జోరుమీదుంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉంది..ఎక్కడివారక్కడే ఉండిపోయారు…ఆమె మాత్రం కొండలు ఎక్కుతున్నారు. లోయలు దిగుతున్నారు..కాల్వలు దాటుతున్నారు…అడవి బిడ్డల ఆకలి తీర్చడానికి రంగంలోకి దిగారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క.. గూడెం వాసుల గోడు వింటున్నారు… అడవి బిడ్డలకు అమ్మయ్యారు. నగరం నడిబొడ్డులోనే ఎవరినెవరు అంతగా పట్టించుకోకుండా ఉంటున్న కరోనా కాలంలో.. నలభై రోజులుగా ఎమ్మెల్యే సీతక్క అడవిలోనే తిరుగుతున్నారు. గిరికోనలు.. రాళ్లు రప్పలు.. ఇవేవీ ఆమెకు కొత్తకాదు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక గిరి గీసుకొని కూర్చోకుండా.. గిరిజనుల గురించి ఆలోచించారు. నలభై రోజుల్లో ఏకంగా 300 గ్రామాలు చుట్టేశారు. 380 ప్రాంతాల్లో పర్యటించారు. కుశల ప్రశ్నలు అడగడానికి తిరగడం లేదామె! ఎమ్మెల్యే రాకతో ఆశ్చర్యపోయారు కొందరు. ‘మా కోసం ఇంత కష్టపడి వచ్చావా’ అని చెమర్చిన కళ్లతో స్వాగతం పలికారు ఇంకొందరు.. వారు ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే నిత్యావసరాలు అందిస్తున్నారు సీతక్క. చేతిలో ఉన్న సంచి నుంచి ఏవో వస్తువులు తీసి ఇస్తున్నారు. భుజాన ఉన్న మూటను మరొకరికి అందిస్తున్నారు. వెంట వచ్చిన బండ్లలో ఉన్న నిత్యావసరాలు అక్కడున్న అందరికీ పంచుతున్నారు. నిన్నటికి నిన్న ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి వచ్చారు. 

ఎర్రటి ఎండలో 20 కిలోమీటర్లు నడిచారు. గూడెం వాసులకు సాయం చేశారు. కొండంత ధైర్యమిస్తూ..కరోనా కల్లోలం మొదలైన నాటి నుంచీ సేవాపథంలో నడుస్తున్నారు సీతక్క. లాక్‌డౌన్‌ మొదలైన వెంటనే ఓ ప్రణాళిక రూపొందించారు. ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాలను ఎంచుకున్నారు. అనుచరులతో కలిసి వెళ్లి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం మొదలుపెట్టారు. ఒక్కో రోజు 5 నుంచి 18 గ్రామాలు పర్యటిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం కొత్తగూడ, తాడ్వాయి, మంగపేట తదితర మండలాల్లో చిన్నచిన్న గూడేలు ఎన్నో ఉన్నాయి. వీటికి దారులు కూడా సరిగాలేవు. అలాంటి ప్రాంతాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా నిత్యావసర వస్తువులు తరలిస్తున్నారు. తానే స్వయంగా వెళ్లి అక్కడి వారికి భరోసానిస్తున్నారు. సాయం ఎంతన్నది కాకుండా.. కొండంత ధైర్యం చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా వంటలు చేయించి తీసుకెళ్తున్నారు. ‘అడవిలో ఇప్పుడు ఇప్పపువ్వులు దొరికే సీజన్‌. వాటిని సేకరించినా అమ్ముకోలేని పరిస్థితిలో గిరిజనులు ఉన్నారు. కొందరు అంబలి, జావ కాచుకొని తాగుతున్నారు. వారిని ఆదుకోవడం నా బాధ్యత. ఎవరో సాయం చేస్తున్నారని తెలిసి..

ఓ గూడెం వాసులు 14 కిలోమీటర్ల నడచి వెళ్లి సామాన్లు తెచ్చుకున్నారట. ఆ విషయం తెలిసి.. మనమే వారి దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అంటారు సీతక్క. గిరి గూడేల్లోనే కాదు.. ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ కార్యకర్తలకు, పోలీసులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారామె. దాతల సహకారంతో ఎందరినో ఆదుకుంటున్నారు. సీతక్క ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌తో చాలామందికి ఉపాధి దూరమైంది. ఆకలితో అలమటిస్తున్నారు. వారి కోసం నా వంతుగా సాయం అందిస్తున్నా. ఎన్నికల సమయంలో వెళ్లని గ్రామాలకు సైతం వెళ్తున్నా. ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కడం ఆనందంగా ఉంది. ఇంకా చాలా గూడేలు తిరగాలి. చేతనైన సాయం చేయాలని సీతక్క అంటున్నారు. మరి మన ఎమ్మెల్యే కు హాట్సాఫ్ చెప్పండి మరి…