చిరంజీవి ఆంతర్యం ఏమిటి ? జగన్ కు గట్టి మద్దతుదారుగా ఎందుకు నిలబడుతున్నాడు ? తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అనితెలిసికూడా మూడు రాజధానుల ప్రతిపాదనను పొగుడుతూ ఎందుకు ప్రకటనచేశాడు ? ఇవీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ వివాదాల్లోకి పోడు. వివాదాస్పద అంశాలపై ప్రకటనలు చెయ్యడు. అయితే రాజధాని విషయంలో విస్పష్టంగా ప్రకటన ఇవ్వడమే కాదు, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని ప్రకటనచేయడమే ఆలోచించదగ్గ విషయం.

మూడు రాజధానుల విషయంలో ఆయన తమ్ముడు , జనసేన నేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తగా , అందుకు విరుద్ధంగా చిరంజీవి పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలిచారు. చిరంజీవి , జగన్ కు అనుకూలంగా చేసిన ప్రకటనను పవన్ కల్యాణ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారంటే , వారు ఎంత షాక్ తిన్నారో అర్ధమవుతుంది. ఇదివాళ్లకు నమ్మలేని నిజం.

మహిళలపై అత్యాచారాల నిరోధానికి రూపొందించిన దిశా బిల్లును కూడా చిరంజీవి గట్టిగా సమర్దించిన సమయంలో కూడా, ఇంత చర్చ జరగలేదు. ఇప్పుడు మూడు రాజధానులు అంశం రాజకీయ నిర్ణయంకావడంతో , చిరంజీవి ప్రకటన సంచలనమైంది. ఇటువంటి ఒక నిర్ణయంమీద వివాదాస్పదమైన చర్చ జరుగుతుండగా, చిరంజీవి ప్రకటన పవన్ కళ్యాణ్ కు ఊహించని దెబ్బే, రాజకీయంగా తాను బద్దశత్రువుగా భావిస్తున్న, జగన్ ను తన అన్న చిరంజీవి ప్రశంసించడం ఆయనకు మింగుడుపడని అంశమే. దీని వెనుక కారణమేమిటో కాలమే సమాధానం చెప్పాలి..