ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో రైతు నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్ సాయం చేసిన యాక్టర్ సోనూ సూద్ తెలంగాణలో మరో యువతికి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శారదకు కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం పోయింది. దీంతో ఆమె దిగులుపడలేదు. ఓ కూరగాయల దుకాణం పెట్టుకుని బతుకు బండి నడిపిస్తోంది. ఈవిషయం మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్ సాఫ్ట్‌వేర్ శారద ఫోన్ నంబర్ అడిగి తెలుసుకున్నారు. శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీనిచ్చారు. ఓరుగల్లుకు చెందిన శారద, అందరిలానే సగటు అమ్మాయి. పేదరికం వల్ల ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని పెంచి పెద్దచేశారు. ఉన్నంతలో తల్లిదండ్రులు మంచిగానే చదివించారు. అందుకు తగిన విధంగా ఆ అమ్మాయి కష్టపడి చదివి దేశ రాజధాని ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించింది. ఇక అమ్మానాన్నలకు ఆసరాగా నిలబడతాననుకుంది.

ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంలో చేరింది. మంచి వేతనం.. అమ్మనాన్నలకు సమీపంలోనే ఉద్యోగం. సంతోషంగా జాబ్‌లో జాయిన్ అయ్యింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా కంపెనీ శారదను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి శారద ఏలాంటి మానసిక కుంగుబాటుకు గురికాకుండా ధైర్యంగా నిలబడింది. ఉద్యోగం లేకపోతేనేం చేసేందుకు పని లేదా అంటూ సర్ది చెప్పుకుంది. తానో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనే అహం పక్కనపెట్టేసి తల్లిదండ్రులతో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.