ప్రాణస్నేహితుడికి పెళ్లైతే సంతోషించాల్సిన వాడు అసూయతో రగిలిపోయాడు. చెల్లెలిలాగా చూసుకోవాల్సిన స్నేహుతుడి భార్య పరువు తీశాడు. చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన బెజ్జం దేవా గాడ్విన్ అనే యువకుడికి 2017లో ఐటీఐ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో చదివే మరో యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కలిసి మెలిసి తిరిగారు. తక్కువ కాలంలోనే ఇద్దరు మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. చదువు పూర్తైన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. ఐటీఐ పూర్తైన తర్వాత ఇద్దరూ నెల్లూరులోని ఓ బైక్ షోరూమ్ లో ఉద్యోగం సంపాదించారు. అక్కడ కూడా ఒకే రూమ్ లో ఉండేవారు. ఇదే సమయంలో దేవా స్నేహితుడు గుంటూరు జిల్లా కొర్నెపాడుకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమికులిద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి గత నెల7న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆ యువకుడు తన భార్యతో కలిసి విడిగా ఉంటున్నాడు.

ఐతే పెళ్లి తర్వాత స్నేహితుడి ఎడబాటు తట్టుకోలేని ఆ దేవా నీచంగా ఆలోచించాడు. ఎలాగైనా తన ఫ్రెండ్ కు భార్యను దూరం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమెకే పంపాడు. ఆమెతో పాటు మరికొందరికి మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. ఇలా చేస్తే తన స్నేహితుడు భార్యకు విడాకులిస్తాడని భావించాడు. తొలుత తన మార్ఫింగ్ ఫోటోలను ఎవరు పంపుతున్నారో అర్ధం కాక ఆందోళన చెందిన యువతి అసలు నిజం తెలియడంతో వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా కోర్టు సమీపంలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడే తన భార్యను అసభ్యంగా చిత్రీకరించి వేధించడంతో సదురు యువకుడు షాక్ కు గురయ్యాడు.