శివారు కాలనీలను కేంద్రంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న హైటెక్‌ వ్యభిచార ముఠా వ్యవహారాలను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని ఐదుగురు సభ్యులపై ఐటీపీ యాక్ట్‌ నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారి చెర నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన బాలికకు విముక్తి కల్పించారు. బాలికను హోంకు పంపించారు.

అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఈ నెల 13న బంగ్లాదేశ్‌ బాలికను కోల్‌కతా నుంచి రాహుల్‌ అనే వ్యక్తి ద్వారా ప్రియ అనే మహిళ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 14న ఉండే జనార్ధన్‌నాయుడు అనే వ్యక్తి దగ్గరకు వ్యభిచారం చేయించేందుకు ప్రియ బాలికను పంపించింది. జనార్ధన్‌నాయుడు ఆ బాలికను విజయవాడలో ఉండే రవి అనే వ్యక్తి వద్దకు వ్యభిచారం చేయించేందుకు నగరానికి పంపించాడు. 15, 16, 17 తేదీల్లో బాలికతో వ్యభిచారం చేయించారు.

పోలీసులకు ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో దాడి చేసి సూరా వెంకట ప్రతాపరెడ్డి, సూరవరపు మహేష్‌ను అరెస్ట్‌ చేశారు. కేసులో ప్రధాన సూత్రధారులుగా జనార్ధననాయుడు, ప్రియ, రవిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు పంపారు. బాలికను మహిళా సంరక్షణ కేంద్రానికి పంపించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.