వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని ఓ బావిలో 9 మంది వలస కార్మికుల మృతదేహాలు బైటపడటం తీవ్ర సంచలనంగా మారింది. గురువారం 4 మృతదేహాలు వెలికితీయగా, శుక్రవారం మరో 5 బైటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. ఒకే బావి లో అన్ని మృతదేహాలు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషప్రయో గం జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసు లు దర్యాప్తు సాగిస్తున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణలో ఉన్న బావిలో శుక్రవారం మరో 5 మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో త్రిపురకు చెందిన షకీల్‌ కుటుంబం కొన్నేండ్ల నుంచి వరంగల్‌లోని శాంతినగర్‌లో ఉంటున్నది. మరో ఇద్దరు మృతులు షాబాద్‌, సోహైల్‌ ఇంతకుముందు ఇదే బావిలో చనిపోయిన మక్సూద్‌, నిషాల కుమారులు. మిగిలిన ఇద్దరు బీహార్‌కు చెందినవారు. మక్సూద్‌ కుటుంబంలోని ఆరుగురు, బీహార్‌ కూలీలు ఇద్దరు ఈ గోడౌన్‌ ఆవరణలోని వేర్వేరు గదుల్లో నివసించేవారు. షకీల్‌ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగతా 8 మృతదేహాలను ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు.