హన్మకొండ బస్టాండ్ లో ఎనీటైం మద్యం దొరుకుతోంది. రాత్రి అయితే చాలు బస్టాండ్ ఆవరణ మద్యం విక్రయాలకు నిలయంగా మారి మందు బాబులతో కిక్కిరిసిపోతోంది. RTC ఆధ్వర్యంలో లీజుకు ఇచ్చిన ఓ షట్టరు, బేకరీ నిర్వహణ కోసం తీసుకొని సంబంధిత అధికారులకు డబ్బులు ముట్టజెబుతూ యథేచ్ఛగా అమ్మకాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ పనులపై పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు హన్మకొండ బస్టాండ్ లో బస్సులు దిగుతుంటారు. ఇలాంటి ప్రాంతంలో సదరు లిక్కరు వ్యాపారి సంబంధిత అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకొని సమీప వైన్‌షాప్ పులోని స్టాక్ నిల్వచేసుకొని తెల్లవార్లూ జోరుగా అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ నేపథ్యంలో వైన్స్ రాత్రి 8.30 గంటలకే మూసివేస్తుండడంతో 9 తర్వాత బస్టాండ్ లోని బేకరీలో మద్యం విక్రయాలు ఊపం దుకుంటున్నాయి. దీంతో రాత్రి 9 దాటిందంటే చాలు మందుబాబులు హన్మకొండ బస్టాండ్ కి దారి కడుతున్నారు. కొంత కాలంగా విచ్చలవిడిగా బస్టాండ్ లోనే బహిరంగంగా మద్యం అమ్ముతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మద్యం విక్రయాలే కాదు బస్టాండ్ ఆవరణ నుంచి ఎలాంటి కేసు అయినా సదరు లిక్కర్ వ్యాపారి కనుసన్నల్లోనే స్టేషన్ కు వెళుతుందని విశ్వసనీయ సమాచారం.

బేకరీలో మద్యం విక్రయిస్తుంటే చివరికి ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లో మద్యం విక్రయిస్తూ ప్రయాణికు లకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు . కాగా , ఈ విషయమై ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఎల్ రామకృష్ణను వివరణ కోరగా ఆర్టీసీ షర్టర్స్ లో మద్యం అమ్ముతున్నట్లు ఇంత వరకు తమ దృష్టికి రాలేదన్నారు. బస్టాండ్ సమీపంలో నిఘా పెట్టి , మద్యం విక్రయించినట్లు కనిపిస్తే దాన్ని సీజ్ చేసి, ఆ వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు…