హన్మకొండ బాలసముద్రంలోని జీవిత బీమా సంస్థ కార్యాలయం పరిధిలో నకిలీ డ్యాకుమెంట్లను సృష్టించి ఎల్‌ఐసీ పాలసీలను తయారు చేసి ఏకంగా జీవిత బీమా సంస్థకే ఇద్దరు ఏజెంట్లు రూ.16 లక్షల టోకరా వేశారు. దీనిపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసుల వివరాల ప్రకారం… ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఎ.కిషన్‌, జె.పరశురాములు కలిసి కొద్ది రోజుల క్రితం మైక్రో ఇన్సూరెన్స్‌ భారతీయ జీవిత బీమా సంస్థకు సంబంధించిన నకిలీ పాలసీలను తయారు చేశారు. మొత్తం 40 మంది పేరుతో వీటిని సృష్టించారు. తర్వాత పాలసీ తీసుకున్న వారు చనిపోయినటు ధ్రువీకరణ పత్రాలను నకిలీవి తయారు చేసి కార్యాలయంలో క్లెయిమ్‌ చేసి రూ. 16 లక్షల వరకు డ్రా చేశారు. సంస్థ జరిపిన ఆడిట్‌లో వెలుగు చూడడంతో మైక్రో ఇన్సూరెన్స్‌ నిర్వహణాధికారి టీవీఎస్‌ రత్నరాజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.