హాయ్‌కి రిప్లై ఇచ్చిన పాపానికి ఓ యువతి నగ్నంగా మాట్లాడే పరిస్థితిని తెచ్చుకుంది చివరకు విషయాన్ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేధిస్తున్న యువకుడిని అరెస్ట్‌ చేశారు. విశాఖపట్నం, యెలమంచిలి మండలం, పులపర్తి గ్రామానికి చెందిన తప్పెట్ల భగవాన్‌ ప్రైవేటు సర్వేయర్‌. మహిళలతో సంబంధాలు పెట్టుకోవాలనే ధ్యాసతో వాట్సాప్‌ ద్వారా అందరీకి మెసేజ్‌లు పంపిస్తాడు. అలా అతడి మెసేజ్‌కు ఎవరైనా రిప్లై ఇస్తే వారితో చాటింగ్‌ చేసి ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడు. ఇలా, రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ యువతి కి హాయ్‌ అని పంపించాడు. దీనికి బాధిత యువతి రిప్లై ఇవ్వడంతో చాటింగ్‌ మొదలు పెట్టాడు. చాటింగ్‌ చేస్తూ ఇద్దరు స్నేహితులుగా మారారు.

కొద్ది రోజుల తర్వాత వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో భగవాన్‌ తన మొబైల్‌ ద్వారా కొన్ని స్క్రీన్‌ షాట్స్‌ తీసుకుని నగ్నంగా వాట్సాప్‌ కాల్‌ మాట్లాడాలని వేధించాడు. ఆందోళనకు గురైన యువతి ఓసారి ఇన్‌స్టాగ్రాంలో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడింది. ఆ నగ్న వీడియో కాల్‌తో మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆందోళన చెందిన యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడు భగవాన్‌ను అరెస్ట్‌ చేశారు.