తెలంగాణలో దాదాపు మూడు నెలలుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల టార్గెట్‌గానే రాజకీయాలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఆ దిశగానే పావులు కదుపుతున్నాయి. తమకు ఉన్న పట్టును నియోజకవర్గంలో మరోసారి నిలుపుకొనేందుకు అధికార టీఆర్ఎస్‌ పార్టీ కసరత్తు చేస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీ ఇచ్చి టీఆర్ఎస్‌ తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలివ్వాలని ప్రయత్నిస్తున్నాయి. హుజూరాబాద్‌ అంటే టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా దాదాపు ఖరారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడంతో, ఆయన సైకిల్ దిగి కారెక్కారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఒక్క సారిగా అధికార పార్టీ కేంద్రంగానే చర్చలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ ఆ రెండు పార్టీలకు ఇచ్చిన షాక్‌ల నుంచి తేరుకుని, కొత్త నేతలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సిద్దం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది.

ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరడంతో బైపోల్‌లో పోటీ చేసేందుకు వారిద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ఖరారయ్యే చాన్స్ ఉందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఎల్.రమణ హుజూరాబాద్‌కు స్థానికేతరుడు కావడం మైనస్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కౌశిక్‌రెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా ఉన్న ఈటలకు గట్టి పోటీ ఇవ్వడంతో ఆయనవైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల వైరల్ అయిన కౌశిక్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందా అన్న చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణలు, నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే, ఇద్దరిలో ఒకరి అభ్యర్థితత్వం ఖరారాయ్యే అవకాశం ఉందనే అంటున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలిద్దరూ కూడా ఈనెల 16న సీఎం కేసీర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. అధికార పార్టీ అనుసరించిన వ్యూహం అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీల్లో మరింత అయోమయం సృష్టించింది.