ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత కీలకమైందో తెలిసిందే. ఒకరకంగా ఈ ఎన్నిక ఆయన రాజకీయ భవిష్యత్ ను నిర్దేశించబోతోందని కూడా చెప్పొచ్చు. అంత కీలకమైన ఈ ఎన్నికవేళ ఈటలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిజానికి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు దాదాపు తొంభై శాతం హుజూరాబాద్ లోని ప్రజాప్రతినిదులు ఈటల వెంటే నిలబడ్డారు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
టీఆర్ఎస్ నేతలు సామ దాన బేద దండోపాయాలు ప్రయోగించి చాలా మందిని తమవైపు తిప్పుకున్నారనే ప్రచారం సాగింది. మొదట ఈటల వెంట నిచిలిన వారిలో చాలా మంది తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. అయినప్పటికీ గులాబీ పార్టీ తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. తాజాగా మరో ఇద్దర కీలక నేతలు ఈటలను వదిలి వెళ్లడంతో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. ఈటల ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్‌, చుక్కా రంజిత్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరిలో రమేష్ సింగిల్ విండో వైఎస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ ఈటలను వదిలి వెళ్లడం ఆయన వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న ఈటల రాజేందర్‌ హుజూరాబాద్ లో ఉన్న తన అనుచరులందరినీ కలుపుకు వెళ్లేందుకు చూస్తున్నారు.

కానీ మధ్య మధ్యలో ఇలాంటి వాళ్లు జారిపోవడం ఆయన అనుచరులను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలే బీజేపీ నుంచి ఈటలకు సరైన సహకారం అందట్లేదనే ప్రచారం కూడా సాగుతోంది. ఈటల రాక కొందరు సీనియర్లకు ఇష్టం లేదని కూడా అంటారు. పెద్దిరెడ్డి వంటివారు బహిరంగంగానే వ్యతిరేకించి పార్టీని వీడారు కూడా. మిగిలిన సీనియర్లలో కొందరు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో ఈటల వెంట పెద్ద నాయకులు ఎవరూ కనిపించకపోవడం కూడా ఈ ప్రచారానికి కారణమవుతోంది. దీంతో హుజూరాబాద్ యుద్ధంలో ఎటు చూసినా ఈటల ఒక్కడే కనిపిస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఈటల సొంతంగానే ప్రచారం చేసుకుంటూ గెలుపుకోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అనుచరుల్లో ఒక్కొక్కరు వెళ్లిపోతుండడం ఈటల వర్గంలో కలవరం పుట్టిస్తోంది. ఎన్నికకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. మరి, ఈ పరిస్థితిని ఈటల ఎలా అధిగమిస్తారన్నది చూడాలి.