సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మహ్మద్ కరీం అనే 25 ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. తమ సామాజిక వర్గానికి చెందిన వాట్సప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్ గా ఉంటుంటాడు. ఈ క్రమంలోనే ఓ వాట్సప్ గ్రూపులో ఓ యువతి ఫొటోను చూశాడు, ఆమెకు వ్యక్తిగత మెసేజ్ లను పంపండం మొదలు పెట్టాడు. ఆమె కూడా అతడితో చాట్ చేసింది. దీంతో ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకున్నాడు. ఆమె ఫేస్ బుక్ ఖాతాలోకి వెళ్లి మరీ కొన్ని ఫొటోలను సేకరించాడు. నేరుగా కలవాలని ఉందని అతడు అనడంతో, ఆమె నిరాకరించింది. అతడి మెసేజ్ లకు స్పందించడమూ మానేసింది. ఇటీవలే ఆమెకు పెళ్లయింది. ఆ విషయం తెలుసుకున్న కరీం మరింత రెచ్చిపోయాడు.

ఆమె పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించాడు. అసభ్యకరమైన మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఆమె భర్త ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. అంతకుముందు ఆమెతో చేసిన చాటింగ్, ఆమె ఫొటోలను కలగలిపిన వీడియోను అతడికి పంపాడు. ఆపై ఫోన్ చేసి ‘ఆమెను వదిలెయ్. లేకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా. మీ పరువు పోతుంది’ అంటూ బెదిరించాడు. ఆ వీడియోను చూసిన ఆ భర్త, భార్యను నిలదీశాడు. దీంతో జరిగిందంతా ఆమె అతడికి చెప్పింది. ఆమె తప్పులేదని ఆ భర్త గ్రహించి వదిలేశాడు. అయితే కరీం మాత్రం అన్నంతపనీ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆ భార్యాభర్తలిద్దరూ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతడు దుబాయిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు ఇటీవలే దుబాయి నుంచి సొంతూరికి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు రిమాండ్ కు తరలించారు.