హైదరాబాద్: వారంతా బీటెక్‌ విద్యార్థులు వీకెండ్‌ కావడంతో సరదాగా గడుపుదామని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ చూసేందుకు వచ్చారు తిరుగు పయనంలో రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకోగా మరో ఇద్దరిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలూరు బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం:

హైదరాబాద్‌ కొంపల్లి ప్రాంతంలోని సెయింట్‌మారి్టన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చప్పిడి సోని (19), మండవ ప్రదీప్‌కుమార్‌ (19), అఖిల్, ఆర్యవర్ధన్‌ బీటెక్‌ సెకండియర్‌ పూర్తిచేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నలుగురు కలిసి శనివారం వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ను సరదాగా చూసేందుకు కారులో వచ్చారు. రాత్రి అక్కడే బస చేసిన వారు ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం ఆలూరు బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే అతివేగంగా వస్తున్న వీరి కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు వెనుకసీట్లో కూర్చొని ఉన్న సోని, ప్రదీప్‌కుమార్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అఖిల్, ఆర్యవర్దన్‌ తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇర్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి అంబులెన్స్‌లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. అఖిల్, ఆర్యవర్దన్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యకోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సరదాగా వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారడం చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.