అల్వాల్ లో నిరుపేద దంపతులకు కుమార్తె (17), కుమారుడు ఉన్నారు. ఆ బాలిక డిగ్రీ చదువుతోంది. ఇంటర్ చదువుతున్న సమయంలో అల్వాల్ లోని ఓ పరీక్షా కేంద్రంలో బాలికకు దీపక్ (20) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పరీక్షలు నిర్వహిస్తున్నన్ని రోజులు వారిద్దరి మధ్య స్నేహం సాగింది. తర్వాత దీపక్ ఓ రోజు ఆమెకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. లైంగికంగా ఆమెను వశపరుచుకున్నాడు. ఇక ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. దానిలో భాగంగానే ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ లో పెట్టేశాడు. దీంతో ఆమె ఓ రోజు డైరెక్ట్ గా కలిసి గట్టిగా నిలదీసింది. బీహెచ్‌ఈఎల్‌ క్వార్టర్స్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలో కలుద్దామని చెప్పింది. అదే రోజు దీపక్‌ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. అక్కడ ఆమె తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ఈ విషయంలో అతడు ససేమిరా అన్నాడు. ఎంతకూ ఓప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.

కోపంతో ఊగిపోయిన దీపక్‌ బాలిక గొంతును ఆమె ధరించిన చున్నితోనే బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. అర్థరాత్రి అయినా కుమార్తె ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెతికారు. అయినా కనిపించలేదు. దీంతో అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు పట్టుకొని ప్రశ్నించారు. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే చంపేసినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని రిమాండ్ కు తరలించారు.